Kishan Reddy: కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి.. మధ్యలో తడబడిన వైనం
- సికింద్రాబాద్ నుంచి ఎన్నికైన కిషన్ రెడ్డి
- తడబాటును సరిదిద్దిన రాష్ట్రపతి
- కొన్ని పదాలను తిరిగి పలికించిన వైనం
తెలంగాణ ఎంపీ జి. కిషన్ రెడ్డి కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కొద్దిసేపటి క్రితం కిషన్ రెడ్డితో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. అయితే, ప్రమాణపత్రం చదవడంలో కిషన్ రెడ్డి కాస్త ఇబ్బంది పడ్డారు. హిందీలో ఉన్న ప్రమాణపత్రం చదువుతూ పలుమార్లు తడబడ్డారు. దాంతో రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఆ పదాలను కిషన్ రెడ్డితో తిరిగి పలికించారు.
ఎట్టకేలకు ప్రమాణస్వీకారం పూర్తిచేసిన కిషన్ రెడ్డి అత్యంత విధేయతతో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపి అక్కడినుంచి నిష్క్రమించారు. కాగా, లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి ఘనవిజయం సాధించిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఖాయం అంటూ కొన్నిరోజుల నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఎంవో నుంచి ఆయనకు ఫోన్ రావడంతో మంత్రిగా ఆయన పదవీప్రమాణం చేయనున్నట్టు రూఢీ అయింది.