Odisha Modi: ప్రమాణ స్వీకారం సందర్భంగా ‘ఒడిశా మోదీ’కి స్టాండింగ్ ఒవేషన్!
- దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన సారంగి
- ప్రమాణ స్వీకారం కోసం వస్తుంటే లేచి నిల్చుని హర్షాతిరేకాలు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
ప్రతాప్ చంద్ర సారంగి.. భారత రాజకీయాల్లో ఇప్పుడీ పేరు పెద్ద సంచలనం. ఒడిశా మోదీగా ఇటీవల పత్రికల ప్రధాన శీర్షికలకు ఎక్కిన ఆయన తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బాలాసోర్ నుంచి విజయం సాధించారు. గతంలో పదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఇప్పుడు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన వస్తుంటే పలువురు ప్రముఖులు, కార్యక్రమానికి హాజరైన వారు అందరూ స్టాండింగ్ ఒవేషన్‌తో ఆయనకు స్వాగతం పలికారు. ఆయన గొప్పతనానికి ఇంతకుమించిన ఉదాహరణ అవసరం లేదేమో!
ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ వెళ్లేందుకు ఆయన తన బ్యాగేజీ సర్దుకుంటున్న ఫొటో సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. కోట్లాదిమంది హృదయాలను గెలుచుకుంది. ఢిల్లీ నుంచి పిలుపు రాగానే సారంగి వెదురు బొంగులతో చేసిన తన పూరి గుడిసెలో సామాన్లు సర్దుకుంటున్న ఫొటోను ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది క్షణాల్లోనే వైరల్ అయింది.
పదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన సారంగి తనకోసం పైసా కూడా వెనకేసుకోలేదు. అవివాహితుడైన సారంగికి ప్రజలే కుటుంబం. తనకు జీతంగా వచ్చిన సొమ్మును మొత్తం ప్రజలకే వినియోగించారు. కుర్తా- పైజమా, భుజానికో బ్యాగ్, గుబురు గడ్డంతో అత్యంత సాధారణంగా కనిపించే సారంగి వాహనం ఓ డొక్కు సైకిలు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన సారంగి తాజా ఎన్నికల్లో బీజేడీ అభ్యర్థి రవీంద్ర కుమార్‌పై 12,956 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా, ఒక్క పైసా ఖర్చు చేయకుండా గెలిచిన సారంగి స్వచ్ఛమైన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం.
బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సారంగి రామకృష్ణ మఠంలో సన్యాసిగా తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అయితే, సామాజిక సేవా కార్యక్రమాలపై ఇష్టంతో ఆరెస్సెస్, వీహెచ్‌పీలతో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలో గిరిజనుల కోసం ఓపెన్ స్కూళ్లు ప్రారంభించారు. ఒడియా, సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడే సారంగి సైకిలుపై ఊరంతా చక్కర్లు కొడుతుంటారు.