sensex: సెన్సెక్స్ దూకుడు... దేశీయ మార్కెట్ల లాభాల పరుగు
- 40 వేల మార్కు దాటిన సెన్సెక్స్
- ట్రేడింగ్ ప్రారంభంలోనే 150 పాయింట్ల లాభం
- 12 వేల పైన ట్రేడవుతున్న నిప్టీ
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం, కొత్త మంత్రివర్గం కొలువు దీరడంతో దేశీయ స్టాక్ మార్కెట్ మంచి జోష్‌తో కొనసాగుతోంది. ఈరోజు ఉదయం నుంచి సెన్సెక్స్ మంచి ఊపుమీద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో ప్రారంభమైన ట్రేడింగ్ ఆ తర్వాత కూడా లాభాల పరుగుతో కొనసాగుతోంది.
లోహ, ఫార్మా, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. దీంతో జూన్ డెరివేటివ్ సీరీస్‌ను సూచీలు రికార్డు స్థాయిలో ఉత్సాహంగా ప్రారంభించాయి. సెన్సెక్స్ 40 వేల మార్కును దాటేయగా నిప్టీ కూడా 12 వేల పైన కొనసాగుతోంది.
ఉదయం 11.15 గంటల సమయానికి సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో 40,068 వద్ద, నిప్టీ 75 పాయింట్ల లాభంతో 12,021వద్ద ట్రేడవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటాస్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎయిర్‌టెల్, కోల్‌ఇండియా, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండిగో తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.75గా కొనసాగుతోంది.