modi cabinet: కేంద్ర కేబినెట్ తొలి భేటీ నేడు...సాయంత్రం 5 గంటలకు ముహూర్తం
- మంత్రులందరికీ ఇప్పటికే సమాచారం
- ప్రత్యేక అజెండా లేదన్న అధికారులు
- పార్లమెంటు సమావేశాల తేదీ నిర్ణయంపై చర్చించే అవకాశం
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు తొలిసారి భేటీకానుంది. ఈ సమావేశానికి సంబంధించి ప్రత్యేక అజెండా ఏమీ లేదని, పార్లమెంటు సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలన్న దానిపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నిన్న కేంద్ర మంత్రులుగా 57 మంది ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రధానితో కలిసి మొత్తం సభ్యుల సంఖ్య 58 అయింది. సభ్యులందరికీ ఇప్పటికే సమావేశానికి సంబంధించిన సమాచారం పంపామని, తప్పని సరిగా హాజరు కావాలని కోరినట్లు అధికారులు తెలిపారు. మోదీ తాజా మంత్రివర్గంలో 36 మంది గత మంత్రివర్గంలో పనిచేసిన వారుకాగా, 21 మంది కొత్తవారు. మంత్రి వర్గంలో 24 మందికి కేబినెట్ హోదా, 9 మందికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సహాయ మంత్రి హోదా కట్టబెట్టారు.