nalgonda: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నల్గొండ క్లాక్‌టవర్ సెంటర్లో ఉద్రిక్తత
- టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ
- ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఎదురు పడగా ఘటన
- కార్యకర్తల పరస్పర నినాదాలతో వివాదం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నల్గొండ క్లాక్‌టవర్ సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. సెంటర్లోని ఓ పోలింగ్ కేంద్రం వద్దకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి రాక సందర్బంగా ఇరువర్గాల అభిమానులు రెచ్చగొట్టుకునే నినాదాలకు దిగారు. ఎవరికి వారు తమ నాయకునికి అనుకూలంగా పోటాపోటీ నినాదాలు చేయడంతో వాగ్వాదం నెలకొని ఉద్రిక్తతలకు దారితీసింది.
ఇరువర్గాలు పరస్పరం తోపులాటకు, బాహాబాహీకి దిగాయి. పరిస్థితి చేజారుతోందని గ్రహించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించి వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి కోమటిరెడ్డిపై భూపాల్‌రెడ్డి గెలుపొందారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భార్య లక్ష్మి పోటీ చేస్తున్నారు.