Jagan: ఫైర్ బ్రాండ్ నేతలను పక్కన బెట్టనున్న వైఎస్ జగన్!
- గుంటూరు, చిత్తూరు జిల్లాల నుంచి మంత్రి పదవుల కోసం పోటీ
- అంబటి రాంబాబు, రోజాలను పక్కన బెట్టే ఆలోచనలో వైసీపీ అధినేత
- ఈ జిల్లాల నుంచి నాలుగురు మంత్రులను ఎన్నుకుంటేనే వీరికి చాన్స్
ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుతం తన మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్న వేళ, పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా పేరు తెచ్చుకున్న అంబటి రాంబాబు, రోజా వంటి వారికి స్థానం దక్కక పోవచ్చని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తన టీమ్ లో వివాదరహితులకు మాత్రమే చోటుంటుందని ఇప్పటికే జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ నేతలుగా కొందరిపై సింపతీ ఉన్నప్పటికీ, మంత్రి పదవులు ఇచ్చే విషయంలో జగన్ సుముఖంగా లేరట.
ఒకవేళ అంబటి రాంబాబు, రోజా వంటి వారికి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, కులం, మతం లెక్కలు, జిల్లాలకు ప్రాతినిథ్యం వంటి లెక్కలన్నింటి తరువాతే చివరిగా అంబటి, రోజా వంటి పేర్లు పరిశీలనకు వస్తాయని పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. కాగా, అంబటి రాంబాబు తాజా ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ పడి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను ఓడించారు. జగన్ వెంట కాంగ్రెస్ పార్టీని వీడిన తొలి బ్యాచ్ నేతల్లో అంబటి కూడా ఒకరు. తొమ్మిదేళ్ల నుంచి జగన్ తో పాటు ఉన్నారు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా, ఆయన చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి.
అంబటి గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటం, ఇక్కడి నుంచి ఒక మంత్రిగా నారా లోకేశ్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఖాయం కావడంతో కాపు వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మంత్రి పదవి దక్కుతుందని అంచనా వేస్తున్న విశ్లేషకులు, గుంటూరు జిల్లాకు మూడో మంత్రి పదవికి చాన్స్ ఉండకపోవచ్చని, ఈ కారణంతో అంబటికి పదవి దక్కదని అంటున్నారు. ఒకవేళ మూడో మంత్రి పదవి లభించే పక్షంలో గుంటూరు ఈస్ట్ నుంచి గెలుపొందిన మహమ్మద్ ముస్తఫాకు మైనారిటీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు.
ఇక రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాకు వస్తే, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పదవి ఖాయమని, ఆయనతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి తన ప్రధాన అనుచరులకు జగన్ చాన్స్ ఇవ్వవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, జగన్ సహా మొత్తం 26 మందికి క్యాబినెట్ లో స్థానం ఉంటుంది. చిత్తూరు, గుంటూరు జిల్లాల నుంచి నలుగురేసి చొప్పున మంత్రి పదవులు ఇస్తేనే అంబటి, రోజాలకు పదవి లభిస్తుంది. మొత్తం 13 జిల్లాలుండగా, జిల్లాకు రెండేసి చొప్పున పదవులను అన్ని సమీకరణాలతో ఇవ్వడం జగన్ కు కత్తిమీద సామే.
ఈ నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ నేతలుగా పేరుపడ్డ అంబటి రాంబాబు, ఆర్కే రోజాలకు ఎంతవరకూ మంత్రి పదవులు లభిస్తాయన్నది మరికొన్ని రోజుల్లో తేలుతుంది.