Cricket: 105 పరుగులకే కుప్పకూలిన పాకిస్థాన్
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్డిండీస్
- రెచ్చిపోయిన విండీస్ బౌలర్లు
- చేతులెత్తేసిన పాక్ బ్యాట్స్ మెన్
వరల్డ్ కప్ లీగ్ దశలో భాగంగా వెస్టిండీస్ తో మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ దారుణంగా విఫలమయ్యారు. పెద్దగా గుర్తింపులేని వెస్టిండీస్ బౌలర్లను ఎదుర్కోలేక చేతులెత్తేశారు. కేవలం 21.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటయ్యారు. బౌన్సీ పిచ్ పై బంతి గమనాన్ని అంచనా వేయడంలో పొరబడిన పాక్ బ్యాట్స్ మెన్ తగిన మూల్యం చెల్లించుకున్నారు.
ఈ పోరులో మొదట టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట్లో రస్సెల్, కాట్రెల్, హోల్డర్ విజృంభించగా, చివర్లో ఒషేన్ థామస్ చెలరేగడంతో పాక్ స్వల్పస్కోరుకే పరిమితమైంది. విండీస్ బౌలర్లలో కెప్టెన్ జాసన్ హోల్డర్ 3 వికెట్లు తీయగా, యువ ఫాస్ట్ బౌలర్ ఒషేన్ థామస్ 4 వికెట్లు సాధించాడు. పాక్ జట్టులో ఫఖార్ జమాన్, బాబర్ అజామ్ చెరో 22 పరుగులు చేశారు. చివర్లో వాహబ్ రియాజ్ 2 సిక్స్ లు, ఒక ఫోర్ తో ధాటిగా ఆడడంతో పాకిస్థాన్ కనీసం 100 పరుగుల మార్కు దాటగలిగింది.