Andhra Pradesh: హైకోర్టును విశాఖకు తరలించండి... ముఖ్యమంత్రిని కోరనున్న ఉత్తరాంధ్ర న్యాయవాదులు
- విశాఖలో అన్ని వసతులు ఉన్నాయి
- నగరం ఎంతో అభివృద్ధి చెందింది
- వైజాగ్ లో హైకోర్టు ఏర్పాటు ఎంతో సులువు
రాష్ట్ర విభజన అనంతరం నాలుగేళ్లపాటు హైదరాబాద్ లోని ఉమ్మడి హైకోర్టునే రాష్ట్ర హైకోర్టుగా పరిగణించిన సంగతి తెలిసిందే. ఆపై సుప్రీంకోర్టు ఆదేశంతో కొంతకాలంగా ఏపీలోని నేలపాడులో తాత్కాలిక భవనాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేశారు. అయితే, ఎలాంటి అనుకూల పరిస్థితులు లేని నేలపాడులో కంటే అన్నిరకాల సౌకర్యాలతో తులతూగుతున్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేయాలంటున్నారు ఉత్తరాంధ్ర న్యాయవాదులు. ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ప్రతిపాదనలు అందజేయాలని నిర్ణయించుకున్నారు.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం హైకోర్టు కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, అన్నిరకాలుగా అభివృద్ధి చెందిన విశాఖలో హైకోర్టు ఏర్పాటు ఎంతో సులువు అని విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.మహేశ్వర్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం వాణిజ్యపరంగా, విద్యావకాశాల పరంగా ఎంతో ముందుందని, అందుకే వైజాగ్ కు హైకోర్టును తరలించడం పెద్ద కష్టం కాబోదని అన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే సీఎం జగన్ ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేస్తామని చెప్పారు.