Rafele fighter jets: కాంగ్రెస్ కార్యాలయం ఎదురుగా రాఫెల్ యుద్ధ విమానం నమూనా.. సోషల్ మీడియాలో వైరల్
- లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా రాఫెల్
- యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందన్న కాంగ్రెస్
- ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపలేకపోయిన ప్రచారం
రాఫెల్ యుద్ధ విమానం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రధాన ఆయుధం. బీజేపీని గద్దె దించేందుకు ఈ ఒక్కటీ సరిపోతుందని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ భావించింది. ఈ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ప్రచారంలో ఊదరగొట్టింది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఎంతగా ప్రచారం చేసినా చివరికి ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. బీజేపీ ఘన విజయం సాధించింది.
కాంగ్రెస్ ప్రచారాస్త్రమైన రాఫెల్ ఇప్పుడు ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట దర్శనమిచ్చింది. కాంగ్రెస్ కార్యాలయానికి సరిగ్గా ఎదురుగా ఉండే భారత వాయుసేన చీఫ్ ధనోవా అధికారిక నివాసం బయట రాఫెల్ యుద్ధ విమాన నమూనాను ఏర్పాటు చేశారు. ఓ ట్విట్టర్ యూజర్ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేయడంతో వైరల్ అయింది. కాంగ్రెస్‌ను ఎద్దేవా చేసేందుకే దీనిని ఏర్పాటు చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.