Andhra Pradesh: నాకు ఆపరేషన్ ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని డాక్టర్లు చెప్పారు!: మురళీమోహన్
- అలహాబాద్ లో రెండు కాళ్లు పట్టేశాయి
- వెన్నెముకలో సమస్య అని డాక్టర్లు చెప్పారు
- ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది
టీడీపీ నేత, నటుడు మురళీమోహన్ కు వెన్నెముక ఆపరేషన్ విజయవంతం అయింది. ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అందులో మాట్లాడుతూ.. ‘గత నెల 14న మా అమ్మగారి అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేసేందుకు అలహాబాద్ వెళ్లాను.
అక్కడ నిమజ్జనం చేస్తుండగా నా రెండు కాళ్లు పట్టేశాయి. నడవలేకపోయా. వెంటనే హైదరాబాద్ కు వచ్చి కేర్ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నా. దీంతో వెన్నుపూసలో ఎల్4, ఎల్5 ప్రాంతాల్లో తేడాలు ఉన్నాయి. ఆపరేషన్ చేయాలండి. ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అని చెప్పారు’
‘ఈ నెల 24న ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. నిన్నరాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాను. ఈ నెల 7న కుట్లు తీస్తారు. శరీరాన్ని కష్టపెట్టవద్దని డాక్టర్లు సూచించారు. నా ఆరోగ్యం సహకరిస్తే అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అందరినీ నేనే ఈ నెల 10 తర్వాత కలుస్తా. లేదంటే ఒకరితర్వాత ఒకరు వచ్చి కలిస్తే నాకు ఇబ్బందేం లేదు. నా ఆరోగ్యం ప్రస్తుతం బాగుంది. ఎవరూ ఆందోళన చెందవద్దు’ అని వీడియోలో మురళీ మోహన్ కోరారు.