Telangana: రీవెరిఫికేషన్ లోనూ తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం... అనామికకు 48 కాదు 21 మార్కులే వచ్చాయట!
- మరోసారి అనామిక మార్కుల విషయంలో గందరగోళం
- అనామిక తల్లిదండ్రుల విమర్శలు
- మాటమార్చిన ఇంటర్ బోర్డు!
తెలంగాణలో ఇంటర్ మార్కుల వ్యవహారం ఎంతటి కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న అవకతవకలు అనేకమంది విద్యార్థుల ఉసురు తీశాయి. అయితే, తాజాగా రీవెరిఫికేషన్ లో కూడా తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఏప్రిల్ లో ఫలితాలు వెల్లడి చేసినప్పుడు అనామిక అనే అమ్మాయి తెలుగులో 20 మార్కులు రావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.
అయితే, రీవెరిఫికేషన్ లో ఆ అమ్మాయికి 48 మార్కులు వచ్చినట్టు మార్కుల మెమో చెబుతోంది. ఈ నేపథ్యంలో అనామిక తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు నిర్వాకంపై విమర్శలు చేయడంతో అధికారులు వెంటనే మాటమార్చారు. అనామిక రీవెరిఫికేషన్ లో కూడా పరీక్ష తప్పిందని, ఆమెకు వచ్చింది 21 మార్కులే అని తెలిపారు. మార్కుల మెమోలో పొరబాటున 48 మార్కులుగా అప్ లోడ్ అయిందని వివరించారు. అధికారుల ప్రకటనతో అనామిక మార్కుల విషయంలో గందరగోళం ఏర్పడింది. దాంతో విద్యాశాఖ అనామిక వ్యవహారంలో హడావుడిగా కమిటీ ఏర్పాటు చేసింది.