Nairuti: కొనసాగనున్న ఎండమంటలు... నైరుతి రాక మరింత ఆలస్యం!
- సోమాలియా తీరంలో అల్పపీడనం
- నెమ్మదిగా కదులుతున్న రుతుపవనాలు
- జూన్ 7కు రెండు రోజులు అటూఇటుగా రానున్న నైరుతి
రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుందని, ఎండ వేడిమి మరికొన్ని రోజులు కొనసాగుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది. తాజా అంచనాలను విడుదల చేస్తూ, నైరుతి రుతుపవనాలు మందగమనంతో సాగుతున్న కారణంగా, జూన్ 7కు రెండు రోజులు అటూఇటుగా కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. గతంలో జూన్ 4 నాటికి నైరుతి భారత్ కు వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడది మరో మూడు రోజులు వెనక్కు వెళ్లింది. ప్రస్తుతం అండమాన్ ను దాటి బంగాళాఖాతంపై రుతుపవనాలు ఉన్నాయని తెలిపింది. ఇవి నెమ్మదిగా కదులుతూ ఉండటంతో అంచనాలను మార్చుకోవాల్సి వచ్చిందని స్కైమెట్ ప్రెసిడెంట్ జీపీ శర్మ వెల్లడించారు. సొమాలియా తీరంలో అల్పపీడనం, మధ్య అరేబియా సముద్రంపై అధిక పీడనం ఉండటమే ఇందుకు కారణమని అన్నారు. రుతుపవనాలు భారత్ ను తాకేదాకా భానుడి భగభగలు తప్పవని అంచనా వేశారు.