India: భారత్‌ను ఓడించేంత శక్తి పాక్‌కు ఉందని అనుకోను: హర్భజన్
- పాక్‌పై గెలిచే సత్తా భారత్‌కు ఉంది
- ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ కంటే పాకిస్థాన్‌తో మ్యాచ్ పెద్దది కాదు
- పాక్ జట్టులో గొప్ప ఆటగాళ్లు లేరు
ప్రపంచకప్ మొదలైంది. ఆదివారం జరిగిన దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మ్యాచ్ తప్ప మిగతా నాలుగు మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగాయి. పట్టుమని 20 ఓవర్లు కూడా ఏ జట్టు ఆడలేకపోయింది. ఆదివారం కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన మ్యాచ్ మాత్రం మజాను పంచింది. అంతేకాదు, దక్షిణాఫ్రికాను ఓడించి బంగ్లాదేశ్ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇక, ఇప్పుడు అందరి దృష్టి 16న జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత్-పాక్ మ్యాచ్‌పై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ కంటే భారత్-పాక్ మ్యాచ్ ఏమంత పెద్దది కాదని పేర్కొన్నాడు. పాకిస్థాన్ జట్టులో ఏమంత గొప్ప ఆటగాళ్లు లేరన్నాడు. రెండు జట్లు పదిసార్లు తలపడితే 9.5సార్లు భారత జట్టే గెలుస్తుందన్నాడు. ఫేవరెట్ల ట్యాగ్ భారత్, ఇంగ్లండ్ జట్లకే ఉందని, పాకిస్థాన్‌కు కాదని అన్నాడు. ప్రపంచకప్‌లో పాక్‌పై ఉన్న రికార్డును ‘మెన్ ఇన్ బ్లూ’ నిలబెట్టుకుంటుందని భజ్జీ ఆశాభావం వ్యక్తం చేశాడు.