DMDK: హీరో విజయకాంత్ కు ఝలక్... డీఎండీకే ప్రాంతీయ పార్టీ హోదాను రద్దు చేసిన ఈసీ!
- 6 శాతం ఓట్లు వస్తేనే ప్రాంతీయ పార్టీ హోదా
- 2.19 శాతం ఓట్లకే పరిమితమైన డీఎండీకే
- గుర్తింపును రద్దు చేస్తూ ఈసీ ఉత్తర్వులు
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన నటుడు విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, ప్రాంతీయ పార్టీ హోదాను కోల్పోయింది. నిబంధనల ప్రకారం కనీసం 6 శాతం ఓట్లను పొందడంలో డీఎండీకే విఫలం కావడంతో, ఆ పార్టీకి ఉన్న ప్రాంతీయ పార్టీ గుర్తింపును రద్దు చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, లోక్ సభ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసిన డీఎండీకే అభ్యర్థులకు కేవలం 2.19 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కనీసం ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో విజయం సాధించినా ప్రాంతీయ పార్టీ గుర్తింపు ఉండేది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి 3 శాతం ఓట్లు రాకపోవడం, ఈ లోక్ సభ ఎన్నికల్లో విఫలం కావడంతోనే గుర్తింపును రద్దు చేస్తున్నట్టు ఈసీ పేర్కొంది.