Telugudesam: ఒక పౌరుషం కలిగిన సింహాన్ని బంధించాలంటే ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు: దివ్యవాణి

  • ఫలితాల పట్ల అందరూ దిగ్భ్రాంతి చెందారు
  • గెలుపోటములు సహజం
  • జగన్, మోదీలకు శుభాకాంక్షలు

టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఓ టీవీ చానల్ స్టూడియోలో తాజా రాజకీయ పరిస్థితులపై అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీని ఓడించడానికి ప్రత్యర్థులు చేయని ప్రయత్నమంటూ లేదని అన్నారు. ఓ పౌరుషం ఉన్న సింహాన్ని బంధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారని అన్నారు. ఎన్నికల్లో దిగ్భ్రాంతికరమైన రీతిలో ఫలితాలు రావడం పట్ల సామాన్యులు సైతం ఆశ్చర్యపోతున్నారని దివ్యవాణి వ్యాఖ్యానించారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం చంద్రబాబు గారిని కలిసేందుకు వెళ్లగా ఆయన కూర్చుని ఉన్నారని, ఏంటన్నయ్యా ఇది? అని పరామర్శించగా, 'మన పని మనం చేసుకుంటూ వెళదాం' అంటూ ఎంతో పరిణతితో మాట్లాడారని వెల్లడించారు. గెలుపోటములు సహజం అని పేర్కొన్నారు. సీఎంగా గెలిచిన జగన్ గారికి, కేంద్రంలో మళ్లీ ప్రధాని అయిన మోదీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.

ఈ ఎన్నికల్లో ఓటమి ఈవీఎంల వల్లో, మరెందువల్లో వచ్చినా, పైన దేవుడు చూస్తూనే ఉంటాడని దివ్యవాణి తెలిపారు. ఇక్కడ జగన్ ప్రభుత్వమో, మోదీ ప్రభుత్వమో, చంద్రబాబు ప్రభుత్వమో ఉండొచ్చు గాక, పైన భగవంతుడి ప్రభుత్వం ఒకటుంటుంది, అందరూ దానికి లోబడి ఉండాల్సిందే, చూసే దేవుడు ఒకడున్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. 'ఈవీఎంలపై నెపం నెట్టాలనుకుంటే ఎప్పటినుంచో ఈవీఎంలపై ఆరోపణలు చేసేవాళ్లం కదా' అని అన్నారు.

  • Loading...

More Telugu News