BCCI: వరల్డ్ కప్ లో భారత్ తొలి మ్యాచ్ ఎందుకు ఆలస్యం అయిందంటే...!
- జూన్ 5న టోర్నీలో ఎంట్రీ ఇస్తున్న టీమిండియా
- ఐపీఎల్ తో తీవ్రంగా అలసిన ఆటగాళ్లు
- మరింత విశ్రాంతి అవసరమని భావించిన బీసీసీఐ
ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఈసారి 10 జట్లు పాల్గొంటున్నాయి. మే 30న ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్ లో కొన్ని జట్లు రెండేసి మ్యాచ్ లు ఆడినా భారత్ ఇంకా తొలి మ్యాచ్ కూడా ఆడకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకు బలమైన కారణమే ఉంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో భారత ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోయారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే కొన్నిరోజుల విశ్రాంతి తర్వాత వెంటనే ఇంగ్లాండ్ పయనమయ్యారు.
అయితే తొలి మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యేందుకు మరికొంత సమయం కావాలని భావించిన బీసీసీఐ తన నిర్ణయాన్ని ఐసీసీ వరల్డ్ కప్ నిర్వాహకులకు తెలియజేసింది. భారత్ కాస్త ఆలస్యంగా తొలి మ్యాచ్ ఆడేలా షెడ్యూల్ లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ అడిగితే కాదనేది ఎవ్వరు? ఐసీసీ వెంటనే ఒప్పేసుకుంది. టీమిండియా తొలి మ్యాచ్ ను జూన్ 5న ఆడేలా టోర్నీ రీషెడ్యూల్ చేసింది. అదీ సంగతి!