Mamata Banerjee: బీజేపీ ‘జై శ్రీరాం’ నినాదంపై మమత మండిపాటు... సీత ఎక్కడంటూ నిలదీత!
- బెంగాల్‌లో బీజేపీ-మమత మధ్య ముదురుతున్న వివాదం
- జైసీతారాం నినాదాన్ని బీజేపీ వక్రీకరించిందని మమత మండిపాటు
- మమత ప్రవర్తన అనాగరికంగా ఉందన్న కేంద్రమంత్రి
బీజేపీ ‘జై శ్రీరాం’ నినాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. జైశ్రీరాం అని నినదిస్తూ బీజేపీ సీతను పక్కన పెట్టేసిందని విమర్శించారు. ‘జై సీతారాం’ నినాదాన్ని వక్రీకరించి ‘జైశ్రీరాం’ అంటూ కొత్త నినాదాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ కూడా సీతామాతను ప్రస్తావించారని, ‘రఘుపతి రాఘవ రాజారాం.. పతిత పావన సీతారాం’ అన్నారని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ‘జైశ్రీరాం’ వివాదం నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జైశ్రీరాం’ నినాదంతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని, కాకపోతే రాజకీయాలకు మతాన్ని జోడించి బెంగాల్‌ను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కాగా, మమత తన ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, మాతంగిని హజ్రా, రవీంద్రనాథ్ ఠాగూర్, ఖాజీ నెహ్రుల్ ఇస్లాం ఫొటోలను చేర్చారు. ‘జై హింద్, జై బంగ్లా’ అనే నినాదాన్ని పెట్టారు. మమత తీరుపై కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో తీవ్ర విమర్శలు చేశారు. ఆమె అనుభవజ్ఞురాలే అయినా ప్రవర్తన మాత్రం అనాగరికంగా ఉందన్నారు. బెంగాల్‌లో బీజేపీ ఉనికిని చూసి మమత భయపడిపోతున్నారని మంత్రి అన్నారు.