Congress: నా కుమారుడి ఓటమికి సచిన్ పైలట్‌దే బాధ్యత.. రాజస్థాన్ సీఎం
- జోధ్‌పూర్ నుంచి పోటీ చేసి ఓడిన వైభవ్ గెహ్లట్
- కుమారుడి ఓటమిపై స్పందించిన సీఎం
- లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటునూ గెలవలేకపోయిన కాంగ్రెస్
రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. జోధ్‌పూర్ నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కుమారుడు వైభవ్ గెహ్లట్ కూడా ఓటమి పాలయ్యారు. కుమారుడి ఓటమిపై ముఖ్యమంత్రి తాజాగా స్పందించారు. వైభవ్ ఓటమికి రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ బాధ్యత వహించాలని అన్నారు.
నిజానికి జోధ్‌పూర్‌పై అశోక్ గెహ్లట్‌కు గట్టి పట్టుంది. ఇక్కడి నుంచి ఆయన ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. జోధ్‌పూర్‌లో గెలుపు తథ్యమని సచిన్ పైలట్ తనతో పలుమార్లు చెప్పారని, ఎన్నికల ప్రచారం కూడా బాగా చేశామని చెప్పారని గెహ్లట్ గుర్తు చేశారు. ఇక్కడ పెద్ద మెజారిటీతో గెలవబోతున్నట్టు చెప్పారని అన్నారు. కాబట్టి కనీసం ఇక్కడి ఓటమికి అయినా సచిన్ పైలట్ బాధ్యత తీసుకుంటే బాగుంటుందని అన్నారు.
ఓటమికి సీఎం కానీ, పీసీసీ చీఫ్ కానీ బాధ్యత వహించాలని ఎవరైనా అంటే దానిని తాను గౌరవిస్తానన్నారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది.