search operation: ఇంకా లభ్యం కాని మిస్సయిన వాయుసేన విమానం ఆచూకీ.. పెద్ద ఎత్తున గాలింపు
- 13 మంది సిబ్బందితో సోమవారం అదృశ్యమైన విమానం
- రంగంలోకి ఇస్రో శాటిలైట్లు, నేవీ విమానాలు
- సెర్చ్ ఆపరేషన్‌కు ఆటంకంగా మారుతున్న వాతావరణం
అరుణాచల్‌ప్రదేశ్ వెళ్తూ సోమవారం అదృశ్యమైన వాయుసేన రవాణా విమానం ఏఎన్-32కు సంబంధించిన ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. అసోంలోని జోర్హత్ నుంచి 13 మందితో బయలుదేరిన విమానం 33 నిమిషాల తర్వాత అదృశ్యమైంది. అప్పటి నుంచి గాలింపు జరుపుతున్నా ఇప్పటి వరకు దాని ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో విమానం జాడ కనుగొనేందుకు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
ఇందులో భాగంగా ఇస్రో శాటిలైట్లు, నేవీకి చెందిన సముద్ర పర్యవేక్షక విమానం పీ8ఐ, అడ్వాన్స్డ్ సెన్సార్లతో కూడిన హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిస్సయిన విమానం ఎమర్జెన్సీ లొకేటర్ నుంచి ఎటువంటి సిగ్నల్స్ అందలేదని అధికారులు తెలిపారు. దీంతో ఇస్రోకు చెందిన రిశాట్ సిరీస్ రాడార్ ఇమేజ్ ఉపగ్రహాలతో వెతుకులాట ప్రారంభించారు. మరోవైపు, దట్టంగా కమ్ముకున్న మేఘాలు సెర్చ్ ఆపరేషన్‌కు ఆటంకం కలిగిస్తున్నాయి.
ఇస్రోకు చెందిన కార్టోశాట్, రిశాట్ శాటిలైట్లు విమానం అదృశ్యమైన ప్రాంతం నుంచి ఫొటోలు తీస్తున్నాయని అధికారులు తెలిపారు. కాగా, విమానంలో ఉన్న 13 మంది వాయుసేన సిబ్బంది కుటుంబాలకు సమాచారం అందించామని , ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నామని భారత వాయుసేన అధికార ప్రతినిధి, గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ తెలిపారు.