Mayawati: మూణ్నాళ్ల ముచ్చటగా ఎస్పీ-బీఎస్పీ సఖ్యత.. మాయావతికి గుడ్‌లక్ చెప్పిన అఖిలేశ్
- లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఎస్పీ-బీఎస్పీ
- శాసనసభ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తామన్న మాయావతి
- భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడంటూ అఖిలేశ్‌పై విమర్శలు
ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమి మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు చెరో దారి పట్టాయి. రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసనసభ ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న బీఎస్పీ చీఫ్ మాయావతి నిర్ణయాన్ని అఖిలేశ్ స్వాగతించారు. దేనికైనా సిద్ధమన్న అఖిలేశ్, మాయావతికి గుడ్‌లక్ చెప్పారు.
ఉప ఎన్నికల్లో పొత్తులు లేకపోతే ఎస్పీ ఒంటరిగానే సిద్ధమవుతుందని అఖిలేశ్ తేల్చి చెప్పారు. ఉప ఎన్నికలు 11 శాసనసభ స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఎస్పీ-బీఎస్పీ కూటమి 15 స్థానాలను కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయిన బీఎస్పీకి ఈసారి 10 స్థానాలు వచ్చాయి.
ఎన్నికల బరిలోకి దిగిన అఖిలేశ్ భార్య డింపుల్ 12 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీనిపై మాయావతి తీవ్ర విమర్శలు చేశారు. యాదవుల ఓట్లు చీలకుండా అఖిలేశ్ ఆపలేకపోయారన్నారు. ఉప ఎన్నికల్లో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. ఆమె నిర్ణయాన్ని స్వాగతించిన అఖిలేశ్ గుడ్‌లక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.