Andhra Pradesh: ముఖ్యమంత్రి జగన్ తో డీజీపీ సవాంగ్ భేటీ.. సీఎం చేతిలో సమర్థులైన ఐపీఎస్ అధికారుల జాబితా!
- తాడేపల్లిలో సీఎంతో డీజీపీ భేటీ
- సమర్థులైన అధికారుల జాబితా సమర్పణ
- 2-3 రోజుల్లో ప్రారంభం కానున్న బదిలీలు
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న సవాంగ్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో ఇటీవల పలువురు ఐఏఎస్, అధికారులు బదిలీ అయిన నేపథ్యంలో ఏయే జిల్లాలకు ఎవరిని ఎస్పీలుగా నియమించాలన్న విషయమై డీజీపీ ముఖ్యమంత్రితో చర్చిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
సమర్థవంతమైన ఐపీఎస్ అధికారులకు కీలక పోస్టింగులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏపీలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్న ఇలాంటి ఐపీఎస్ అధికారుల జాబితాను రూపొందించాలని సవాంగ్ కు జగన్ సూచించారు. తాజాగా ఆ నివేదికను జగన్ కు సమర్పించిన సవాంగ్.. ఏయే జిల్లాకు ఎవరిని నియమించాలన్న విషయమై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ జాబితాకు అనుగుణంగా రాబోయే 2-3 రోజుల్లో ఐపీఎస్ ల బదిలీలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.