EVM: ఈ ఎన్నికల్లో వెలువడిన తీర్పు నిజమైనది కాదు: నారాయణ
- 63 శాతం ప్రజలు బీజేపీని తిరస్కరించారు
- ఈవీఎంలను పూర్తిగా నిషేధించాలి
- వామపక్ష పార్టీల పునరేకీకరణ జరగాలి
37 శాతం ఓట్లు సాధించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కానీ 63 శాతం మంది ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. గుంటూరులోని అరండల్‌పేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, దామాషా పద్ధతితో ఎన్నికలు నిర్వహిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఈ ఎన్నికల్లో వెలువడిన తీర్పు నిజమైనది కాదని అన్నారు.
ఈవీఎంలను పూర్తిగా నిషేధించాలని నారాయణ డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈవీఎంలు వాడటం లేదని గుర్తు చేశారు. అవకాశవాద రాజకీయ శక్తులను ఎదుర్కొనేందుకు దేశంలోని అన్ని వామపక్ష పార్టీల పునరేకీకరణ జరగాలన్నారు. ఈ ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు చేదు ఫలితాలు ఎదురయ్యాయని నారాయణ పేర్కొన్నారు.