Monsoon: చల్లని కబురు చెప్పిన స్కైమెట్... మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు
- ఢిల్లీ చేరేందుకు మరో 15 రోజుల సమయం!
- ఈసారి 93 శాతం వర్షపాతం
- రుతుపవనాలు బలహీనపడే అవకాశం
రికార్డుస్థాయి ఎండలతో, భరించలేని ఉక్కపోతతో అల్లాడిపోతున్న దేశవాసులకు ప్రయివేటు వాతావరణ సంస్థ స్కైమెట్ శుభవార్త చెప్పింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని, ఆపై దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని స్కైమెట్ తెలిపింది. దేశానికి అత్యధిక వర్షపాతాన్నిచ్చే ఈ రుతుపవనాలు రాజధాని ఢిల్లీ చేరేందుకు మరో రెండు వారాల సమయం పడుతుందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల సీజన్ లో ఈసారి 93 శాతం వర్షపాతం ఉంటుందని స్కైమెట్ సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త సమర్ చౌదరి తెలిపారు. రుతుపవనాల ముందు వచ్చే వర్షాలు కూడా ఈసారి తక్కువేనని, ఎల్ నినో, గ్లోబల్ వార్మింగ్ కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయని ఆయన వివరించారు.