Anantha Krishnan: వాట్సాప్‌లో ప్రమాదకర బగ్‌ను కనుగొన్న విద్యార్థి... బహుమతి ప్రకటించిన ఫేస్బుక్!
- కృత్రి మేథలో పరిశోధనలు చేస్తున్న అనంతకృష్ణన్
- సైబర్ నేరాల నియంత్రణలో సహకారం
- అనంతకృష్ణన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఫేస్బుక్
సామాజిక మాధ్యమాలను వినియోగించడమే కాదు, దానిలోని లోపాలను గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించడం కొందరికి మాత్రమే సాధ్యం. అలాంటి వారిలో కేరళకు చెందిన అనంతకృష్ణన్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఒకడు. ప్రస్తుతం కృత్రిమ మేథలో పరిశోధనలు చేయడంతో పాటు సైబర్ నేరాల నియంత్రణలో అనంతకృష్ణన్ కేరళ పోలీసులతో కలిసి పని చేస్తున్నాడు. అతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇటీవల వాట్సాప్‌ను చూస్తుండగా అందులో ప్రమాకరమైన ‘బగ్’ను కనుగొన్నాడు.
అది వినియోగదారులకు తెలియకుండా వాట్సాప్ ఖాతాలోని సమాచారాన్ని వేరేవారు తొలగించేందుకు అవకాశం కల్పిస్తుందని తెలుసుకున్నాడు. వెంటనే ఫేస్బుక్ యాజమాన్యానికి తెలియజేసి, దానికి పరిష్కార మార్గాన్ని కూడా సూచించాడు. వెంటనే స్పందించిన ఫేస్బుక్ యాజమాన్యం వాట్సాప్‌లో ఆ ప్రమాదకర బగ్‌ను కనుగొని వెంటనే తొలగించింది. అంతేకాదు, ఆ వెంటనే అనంతకృష్ణన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, 500 డాలర్ల రివార్డును ప్రకటించింది. అలాగే ప్రముఖ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటును కూడా కల్పించింది.