Donald Trump: ఇండియా, చైనా, రష్యాలు కలుషితాలు ..ట్రంప్ మండిపాటు!
- ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ట్రంప్
- అపరిశుభ్ర వాతావరణంలో నివసిస్తున్న ఇండియా, చైనా, రష్యా ప్రజలు
- స్వచ్ఛమైన గాలి కూడా లభించే పరిస్థితి లేదు
- పర్యావరణ పరిరక్షణకు చర్యలు ఎక్కడ?
- బ్రిటీష్ మీడియాతో అమెరికా అధ్యక్షుడు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రష్యా, చైనా, ఇండియాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కసును ప్రదర్శించారు. ఈ దేశాల్లో పరిశుభ్రమైన గాలి, నీరు లభించే పరిస్థితి లేదని, పర్యావరణ పరిరక్షణకు ఎవరూ ప్రయత్నించడం లేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న ట్రంప్ బ్రిటిష్ టెలివిజన్ చానల్ ఐటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన వాతావరణం ఉన్న దేశాల్లో అమెరికా ఒకటని అన్నారు.
తాను ప్రిన్స్ చార్లెస్ తో 15 నిమిషాల పాటు మాట్లాడాలని అనుకున్నానని, కానీ అది గంటన్నర పాటు సాగిందని, అత్యధికంగా తమ మధ్య పర్యావరణంపైనే చర్చ సాగిందని చెప్పారు. అమెరికాలో ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీలుస్తుంటే, ఇండియా, చైనా, రష్యా వాసులు కలుషిత వాతావరణంలో బతుకుతున్నారని, ఆ దేశాల ప్రజలకు పరిశుభ్రతపై అవగాహనే లేదని ఎద్దేవా చేశారు. ఈ దేశాల్లోని కొన్ని నగరాల పేర్లను తాను చెప్పబోనని అంటూనే, అక్కడికి వెళితే, కనీసం గాలిని కూడా పీల్చుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.