Ram Madhav: ఏపీలో మరో ఐదేళ్లలో అధికారంలోకి వస్తామని మేం భావించడం లేదు!: రామ్ మాధవ్
- పార్టీని మరింత బలోపేతం చేస్తాం
- 2024 టార్గెట్ గా వ్యూహాలు
- తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయం మేమే
- బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్
ఆంధ్రప్రదేశ్ లో మరో ఐదేళ్లలో అధికారంలోకి వస్తామని తామేమీ భావించడం లేదని, అయితే, తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి ఉందని, పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం ద్వారా, అధికారానికి దగ్గరవుతామని బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, 2024 ఎన్నికల నాటికి తూర్పు భారత్ రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ కలుపుకుని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిని పెట్టనున్నట్టు తెలిపారు. తెలంగాణను కేసీఆర్, నిజాంలా పరిపాలిస్తున్నాడని ఆయన ఆరోపించారు.
ఇక్కడి ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని, ఆ కారణంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో పాటు, మరో రెండు చోట్ల రెండో స్థానంలో నిలిచిందని అన్నారు. ఈ ఫలితాలు తమకెంతో సంతృప్తిని కలిగించాయని రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని, అది బీజేపీ పార్టీయేనని అన్నారు. 2014లో వండర్ ఫుల్ స్టేట్ గా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఒవైసీ చంకనెక్కి కూర్చున్న కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. తాము ఎవరిపైనా వ్యక్తిగత కక్షతోలేమని, సీబీఐ, ఈడీ వంటి విచారణ సంఘాలపై ఒత్తిడి పెట్టడం లేదని చెప్పారు.