Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కౌలు రైతుల సంఘం బహిరంగ లేఖ!
- ఆంధ్రప్రదేశ్ లో 32 లక్షల కౌలు రైతులున్నారు
- వీరికోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి
- కౌలు రైతులను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఈరోజు ఏపీ కౌలు రైతుల సంఘం బహిరంగ లేఖ రాసింది. కౌలు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా శాఖను ఏర్పాటు చేయాలని లేఖలో కోరింది. ఏపీలో ప్రస్తుతం 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు, కార్యదర్శి పి.జమలయ్య తెలిపారు. అన్ని ప్రాంతాలు, పంటల విషయంలో కౌలు వ్యవసాయం విస్తరిస్తోందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం కౌలు ధరలు పెరుగుతూనే ఉన్నాయనీ, ఇన్ పుట్ ధరలు, వడ్డీల భారంతో కౌలు రైతులు కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కౌలు రైతులను ఆదుకోవాలన్న ప్రస్తావనే ఉండటం లేదని గుర్తుచేశారు. పంట రుణాల జారీ సందర్భంగా కూడా కౌలు రైతులను పట్టించుకోవడం లేదన్నారు.
గతంలో జరిగిన రుణమాఫీలో కౌలురైతులు దగాపడ్డారని, కౌలు రైతుల రక్షణ, సంక్షేమం జరగాలన్నా, వ్యవసాయం లాభసాటిగా మార్చాలన్నా కౌలు రైతులను పట్టించుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా కౌలు రైతులను పట్టించుకోకుండా పెట్టుబడి సాయాన్ని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న కౌలు రైతులకు అన్నిరకాలుగా అన్యాయం జరుగుతోందని విమర్శించారు.