Rajasthan: అత్యధిక ఉష్ణోగ్రతలో ఇండియా ప్రపంచ రికార్డు... నిప్పుల కుంపటిగా మారిన రాజస్థాన్!

  • చూరులో 50.8 డిగ్రీలకు ఉష్ణోగ్రత
  • అల్లాడిపోతున్న ప్రజలు
  • వడదెబ్బ తగిలిన వారితో నిండిపోతున్న ఆసుపత్రులు

రాజస్థాన్ ప్రజలు ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు పిట్టల్లా రాలుతున్నారు. ముఖ్యంగా చూరు ప్రాంతంలో పగటి పూట ఉష్ణోగ్రత ప్రపంచంలోనే అత్యధికంగా 50.8 డిగ్రీలకు పెరిగింది. బయటకు వస్తే నిప్పుల కుంపటిపైకి వచ్చినట్టే. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు తగ్గడం లేదు. ప్రస్తుతం చూరు ప్రాంతం 'వరల్డ్స్ హాటెస్ట్ ప్లేస్'గా ఉంది. ప్రజలు తమ దైనందిన అవసరాలను తీర్చుకునేందుకు సైతం బయటకు రాలేని పరిస్థితి నెలకొని వుంది. మరో వారం రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉంటుందని, ఆపై నిదానంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉష్ణోగ్రత ఇంత అధికంగా ఉంటే, తెల్లవారుజామున నాలుగు గంటలకే కరెంట్ ను కట్ చేస్తున్నారని, దీంతో తాము ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నామని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. రోజుకు 10 కిలోల ఐస్ ను ఇంట్లోకి తెచ్చినా, వేడి నుంచి ఉపశమనం లభించడం లేదని, నిత్యావసర సరుకుల్లో ఒకటిగా ఐస్ మారిపోయిందని చెబుతున్నారు. ఐస్ ను తెచ్చి, వాటర్ ట్యాంకర్లు, ఎయిర్ కూలర్లలో వేసుకోవాల్సి వస్తోందని పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి రాధే శర్మ తెలిపారు.

ఇక ఎండ వేడిమికి తాళలేక వడదెబ్బ తగిలి ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య కూడా ఈ ప్రాంతంలో అధికంగానే ఉంది. వడదెబ్బ తగులుతున్న వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అత్యవసర పరిస్థితిని ప్రకటించిన రాజస్థాన్ ప్రభుత్వం, వైద్యులందరి సెలవులనూ రద్దు చేసింది. మూడు రోజుల వ్యవధిలో 70 మంది వడదెబ్బతో ఆసుపత్రిలో చేరారని, చూరు ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోగా రామ్ తెలిపారు. కాగా, ఎండ నుంచి ఉపశమనం కోసం ఇక్కడి ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకున్నారు. మజ్జిగ, ఉల్లిపాయలు, పెరుగు వంటివి తప్పనిసరిగా తమ అల్పాహారంలో చేర్చుకుంటున్నారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News