Andhra Pradesh: నకిలీ విత్తనాల వ్యాపారులను జైలుకు పంపిస్తాం!: ముఖ్యమంత్రి జగన్ హెచ్చరిక
- నకిలీ విత్తనాలపై ఏపీ సీఎం ఆగ్రహం
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
- ఇందుకోసం కొత్త చట్టం తీసుకొస్తామని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లో రైతులను నిండా ముంచేస్తున్న నకిలీ విత్తనాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నకిలీ విత్తనాల సరఫరా, అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు వ్యవసాయం, దాని అనుబంధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలనీ, అవసరమైతే జైలుకు పంపేందుకు కూడా వెనుకాడవద్దని స్పష్టం చేశారు. ఇందుకోసం కొత్తగా విత్తన చట్టం తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే ఈ విషయమై శాసనసభలో చర్చించి ప్రత్యేక చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు.
గ్రామ సచివాలయాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల పంపిణీ జరగాలని అన్నారు. ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంచి సలహాలు, సూచనలు ఇచ్చే సిబ్బందికి సన్మానం చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. రైతులకు బీమా సౌకర్యాన్ని సక్రమంగా అందించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని వ్యాఖ్యానించారు. ఈ బీమాకు సంబంధించి ప్రీమియంను కూడా ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు.