rbi: ఆన్ లైన్ బ్యాంకింగ్ కు ఆర్బీఐ ఊతం.. ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపై చార్జీల ఎత్తివేత!
- ఏటీఎం చార్జీలపై అధ్యయనం కోసం కమిటీ
- ప్రయోజనాన్ని ఖాతాదారులకు బదలాయించాలన్న ఆర్బీఐ
- నేడు ముంబైలో ముగిసిన ఆర్బీఐ సమావేశం
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు జరిగిన ఆర్బీఐ సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ ద్వారా నగదు బదిలీలపై ఇప్పటివరకూ వసూలు చేస్తున్న చార్జీలను రద్దు చేసింది.
సాధారణంగా రూ.2 లక్షల వరకూ నగదు బదిలీల కోసం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(నెఫ్ట్), అంతకంటే ఎక్కువ మొత్తం నగదు బదిలీకి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ సిస్టమ్(ఆర్టీజీఎస్)ను వాడుతున్నారు. అయితే ఈ ఆన్ లైన్ వ్యవహారాలు జరిపినందుకు బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయి.
ఈ చార్జీలు బ్యాంకును బట్టి ఒక్కోలా ఉంటున్నాయి. ఎస్బీఐ అయితే ఒక్కో నెఫ్ట్ లావాదేవీపై రూ.1 నుంచి రూ.5 వరకు, ఆర్టీజీఎస్ లావాదేవీలపై రూ.5 నుంచి రూ.50 వరకు చార్జీని ప్రస్తుతం వసూలు చేస్తోంది. తాజాగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ చార్జీలను తొలగించినట్లు ఆర్బీఐ ప్రకటించింది.
ఇందుకు సంబంధించి వారం రోజుల్లోగా ఉత్తర్వులను జారీచేస్తామనీ, ఈ ప్రయోజనాలను బ్యాంకులు వినియోగదారులకు బదలాయించాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే ఏటీఎం చార్జీలు భారీగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ విషయమై ఓ కమిటీని నియమించినట్లు రిజర్వు బ్యాంకు పేర్కొంది.