accident: హిమాలయాల మూలికల కోసం వెళితే ప్రాణాలు పోయాయి!
- అత్యంత ఖరీదైన వనమూలిక 'యార్సాగుంబా'
- కిలో రూ.60 లక్షల పైమాటే
- వేసవిలో నేపాలీలకు దీని సేకరణే జీవనోపాధి
హిమాలయాల్లో వేసవిలో మాత్రమే లభించే అత్యంత అరుదైన ‘యార్సాగుంబా’ వనమూలికల సేకరణ కోసం వెళ్లిన ఎనిమిది మంది నేపాలీలు అక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. హిమాలయాలను అధిరోహించిన ఈ ఎనిమిది మందిలో ఐదుగురు అనారోగ్యంతో మరణించారని, మరో ఇద్దరు వనమూలికలు సేకరించే క్రమంలో కొండపై నుంచి జారిపడి చనిపోయారని, ఈ ప్రమాదంలో తల్లితో వెళ్లిన ఓ చిన్నారి కూడా ప్రాణం కోల్పోయిందని అక్కడి పోలీసులు తెలిపారు.
నేపాల్‌లోని డోప్లా జిల్లాలో నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. లైంగిక కోరికలు రేకెత్తించడంలో యార్సాగుంబా అత్యంత చురుకుగా పనిచేస్తుందని ఓ అభిప్రాయం. ఎన్నో ఔషధ గుణాలు కూడా దీని సొంతం. దీని ఖరీదు కేజీ లక్ష డాలర్లు ( మన కరెన్సీలో రూ.60 లక్షలు పైమాటే) పలుకుతుంది. దీంతో ఉపాధి అవకాశాలు అంతంతగా ఉండే గ్రామీణ నేపాలీలు వేసవి ఆరంభమై హిమాలయాల్లో మంచు కరగడం ప్రారంభంకాగానే అక్కడి పచ్చిక బయళ్లవైపు వీటి సేకరణ కోసం పరుగులు పెడతారు.
గొంగళి పురుగులాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగు మాదిరిగా పెరిగే ఫంగస్ ‘యార్సాగుంబా’. పూర్తిగా రూపొందిన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా ఉంటుంది. రెండు నుంచి మూడు సెంటిమీటర్ల పొడవు ఉంటుంది. యార్సాగుంబా సేకరణ నేపాల్‌లో చాలామందికి ఉపాధి మార్గం కావడంతో అక్కడి ప్రభుత్వం వీరి కోసం వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తుంది. నేపాల్ రాజధాని ఖాట్మండ్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోప్లా జిల్లాలో యార్సాగుంబా సేకరణ దారులు అధికం.