Maharashtra: రైతుల పేరుతో రూ.4,500 కోట్ల రుణం... ఓ చక్కెర కర్మాగారం నయా మోసం!
- వారికి తెలియకుండానే వారి భూములు తాకట్టు
- ఒక్కో రైతుపై రూ.25 లక్షల రుణ భారం
- బ్యాంకు నోటీసులు అందడంతో కంగుతిన్న కర్షకులు
ఓ చక్కెర కర్మాగారం తన చెరకు రైతులను నట్టేట ముంచింది. ఏకంగా రైతుల భూముల్నే బ్యాంకుల్లో కుదువపెట్టి 5,400 కోట్ల రూపాయల రుణం తీసుకుని నయా మోసానికి తెరలేపింది. మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ మోసం చూసి ఈడీ అధికారులే నోళ్లు వెళ్ళబెడుతున్నారు.
వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రకు చెందిన గంగఖేడ్ సుగర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్‌కు చక్కెర కర్మాగారం ఉంది. రత్నాకర్ గుత్తే దీని ప్రమోటర్. చుట్టుపక్కల ప్రాంతాల చెరకు రైతుల నుంచి ఈ కంపెనీ పంట కొనుగోలు చేస్తుంటుంది. ఈ విధంగా 600 మంది రైతుల భూ వివరాలు సేకరించింది. వారికి ఏమాత్రం తెలియకుండా వాటిని పంట, రవాణా పథకం కింద బ్యాంకుల్లో తనఖాపెట్టి ఏకంగా 5,400 కోట్ల రుణం పొందింది. 'మీరు రూ.25 లక్షలు బకాయి ఉన్నారంటూ' బ్యాంకుల నుంచి నోటీసులు అందడంతో రైతులంతా కంగుతిన్నారు.
దీంతో రైతుల తరపున ఎన్సీపీ నేతలు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాక ఇది వేల కోట్ల కుంభకోణం అని బయట పడడంతో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. కంపెనీ నిర్వాహకులు మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతో కంపెనీ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 9 కార్యాలయాలపై దాడులు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకుంది.