Rains: నేడు కేరళకు రుతుపవనాలు.. నిన్నటి నుంచే కురుస్తున్న వర్షాలు
- వారం రోజులు ఆలస్యమైన రుతుపవనాల రాక
- పలు జిల్లాల్లో హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
- రేపటి నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనం
ఈ నెల 1న కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా నేడు కేరళలో అడుగుపెట్టనున్నాయి. రుతుపవనాలు ఇంకా తాకకముందే కేరళలో నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి. మరోవైపు, రుతుపవనాల రాక నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో రెడ్, ఆరంజ్, యెల్లో అలర్టులను జారీచేశారు.
ఆదివారం కేరళ, కర్ణాటక తీర ప్రాంతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడనుందని, దీని ప్రభావం వల్ల రుతుపవనాలు వాయవ్య దిశలో వేగంగా కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, గతేడాది విపత్తును దృష్టిలో పెట్టుకుని ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేరళ విపత్తు నిర్వహణ సంస్థ కార్యదర్శి శేఖర్ తెలిపారు. గతేడాది భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.