Andhra Pradesh: సీఎం జగన్ కు ఊరట.. సీబీఐ కోర్టుకు హాజరు నుంచి తాత్కాలిక మినహాయింపు!
- వైసీపీ నేత విజయసాయిరెడ్డికి కూడా
- సీఆర్పీసీ సెక్షన్ 317 కింద పిటిషన్ దాఖలు
- రెండు పిటిషన్లను అనుమతించిన సీబీఐ ప్రత్యేక కోర్టు
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు స్వల్ప ఊరట లభించింది. ప్రస్తుతం ఆయన ప్రతీ శుక్రవారం విచారణ కోసం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో విధుల నిర్వహణలో భాగంగా కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు జగన్ తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి సీబీఐ స్పెషల్ కోర్టుకు తెలిపారు.
ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 317 కింద అశోక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యుల సమావేశంలో ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు పేర్కొన్నారు. వాదనలు విన్న సీబీఐ స్పెషల్ కోర్టు ఈ రెండు పిటిషన్లను అనుమతిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.