Andhra Pradesh: ఉచిత ఇసుక పేరుతో కోట్లు దోచుకున్నారు.. విచారణ జరిపించండి!: సీఎంకు కన్నా లక్ష్మీనారాయణ లేఖ
- ఉచిత ఇసుక పేరుతో ఏపీలో భారీ అక్రమాలు జరిగాయి
- ఏపీకి ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా విధించింది
- ఈ అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరపాలి
ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన బినామీలు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ ఇసుక అక్రమాలపై, అలాగే ఇసుక మాఫియా నడిపిన వారందరిపై విచారణ జరపాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కన్నా కోరారు.
ఈ మేరకు ఆయన ఏపీ సీఎంకు ఈరోజు బహిరంగ లేఖ రాశారు. అందులో ఇసుక అక్రమాల కారణంగా జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఏపీకి రూ.100 కోట్ల జరిమానా విధించిందని కన్నా తెలిపారు. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరిపి పర్యావరణాన్ని నాశనం చేసిన ప్రతీఒక్కరికీ శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కన్నా మరోసారి కోరారు. ఈ మేరకు తాను రాసిన లేఖను కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.