Kerala: భానుడి భగభగలకు చెక్.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
- నెలరోజుల్లోగా దేశమంతా విస్తరణ
- దాదాపు 96 శాతం వర్షపాతం కురుస్తుందన్న ఐఎండీ
- దేశ వర్షపాతంలో 70 శాతం నైరుతీ రుతుపవనాల వల్లే
ఎండలతో అల్లాడిపోతున్న భారతీయులకు శుభవార్త. దాదాపు వారం రోజులుగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఈరోజు భారత తీరాన్ని తాకాయి. కేరళ రాష్ట్రాన్ని రుతుపవనాలు ఈరోజు తాకినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ రుతుపవనాలు క్రమంగా దేశమంతటా విస్తరిస్తాయని చెప్పింది. ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో కేరళలో చాలాచోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయని పేర్కొంది. రాబోయే నెలరోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశమంతటికీ విస్తరిస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.
నైరుతి రుతుపవనాలతో ఈసారి సాధారణ వర్షపాతమే నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో నైరుతి రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సగటులో 96 శాతం వర్షపాతం నమోదు అవుతుందని వెల్లడించింది. భారత్ లో నమోదయ్యే వర్షపాతంలో 70 శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తాయి.