Ismart Shankar: 'ఇస్మార్ట్ శంకర్' లీక్ పై పోలీసులను ఆశ్రయించిన చార్మి
- కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు
- ఇన్ స్టాగ్రామ్ లో 'ఇస్మార్ట్ శంకర్' స్క్రిప్ట్ లీక్
- ఉలిక్కిపడిన చిత్రబృందం
ఇటీవల కాలంలో సినిమా రిలీజ్ కు ముందే దానికి సంబంధించిన కంటెంట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమవడం పరిపాటిగా మారింది. ఒకప్పుడు పైరసీని పెద్ద సవాలుగా భావించినా, ఇప్పుడు ఆన్ లైన్ లీకేజి దాన్ని మించిన సమస్యగా మారింది. తాజాగా, పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమా స్క్రిప్ట్ ఇన్ స్టాగ్రామ్ లో లీకైంది. బజ్ బాస్కెట్ అనే ఇన్ స్టా గ్రూప్ లో ఈ సినిమా స్క్రిప్ట్ కనిపించడం పట్ల చిత్రబృందం వెంటనే అప్రమత్తమైంది. ఆ గ్రూప్ అడ్మిన్ మురళీకృష్ణను 'ఇస్మార్ట్ శంకర్' చిత్రయూనిట్ సంప్రదించగా, భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
పైగా, డబ్బు ఇవ్వకపోతే ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కూడా స్క్రిప్ట్ లీక్ చేస్తానని బెదిరించడంతో ఈ చిత్ర సహనిర్మాత చార్మీ పోలీసులను ఆశ్రయించారు. బజ్ బాస్కెట్ గ్రూప్ అడ్మిన్ మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె సైబరాబాద్ పోలీసులను కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రామ్ కథానాయకుడిగా నిధి అగర్వాల్, నభా నటేశ్ కథానాయికలుగా పూరీ దర్శకత్వంలో వస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.