veerappa moili: కొత్త అధ్యక్షుడిని వెతికి పెట్టిన తర్వాత మీరు తప్పుకోండి: రాహుల్ కు వీరప్ప మొయిలీ సూచన
- రాహుల్ వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చు
- అయితే, సరైన వ్యక్తిని వెతికిపెట్టిన తర్వాత తప్పుకోవాలి
- కాంగ్రెస్ అధ్యక్షుడంటే ఒక జాతీయ బాధ్యత
సార్వత్రిక ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు రావడంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర మనస్తాపానికి గురైన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే, ఆయన రాజీనామాను సీడబ్ల్యూసీ ఆమోదించలేదు. కానీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ మాత్రం రాహుల్ రాజీనామాను ఆమోదించారు. అయితే ఒక కండిషన్ కూడా పెట్టారు. రాహుల్ గాంధీ వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చని... అయితే, పార్టీకి అధ్యక్షుడిగా సరైన అభ్యర్థిని వెతికి పెట్టిన తర్వాతే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించారు. ప్రస్తుతం పార్టీ సంక్షోభంలో ఉందని... అలాంటి బాధ్యతలను నిర్వహించే సమర్థవంతమైన వ్యక్తిని వెతికి పెట్టాలని అడిగారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడంటే పార్టీ బాధ్యతలు మాత్రమే కాదని... ఇది జాతీయ బాధ్యత అని అన్నారు.