Gaya: వినాయకుడి విగ్రహానికి చెమటలు... తండోపతండాలుగా భక్తుల రాక!
- బీహార్ గయలో ఘటన
- తాకితే తడిగా ఉంటున్న వినాయక విగ్రహం
- స్వామివారు ఎండవేడిమితో ఇబ్బంది పడుతున్నారన్న పూజారులు
విగ్రహాలు పాలు తాగడం, వేప చెట్ల నుంచి పాలుకారడం ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న మాటలు! ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది. బీహార్ లోని గయ ప్రాంతంలో ఉన్న ఓ ఆలయంలో వినాయక విగ్రహం నుంచి చెమటలు వస్తున్నాయన్న విషయం సంచలనం సృష్టించింది. గయలోని రాంశిల తకుర్బాదీ ఆలయం గర్భగుడిలో ఉన్న వినాయక విగ్రహం కొన్నిరోజులుగా తడిగా కనిపిస్తోంది. చేతితో తాకితే చెమ్మ తగులుతోంది.
దాంతో స్వామివారికి వేసవితాపం కారణంగా చెమటలు పోస్తున్నాయంటూ ప్రచారం మొదలైంది. కొద్దిసమయంలో అది గయ పరిసర ప్రాంతాలకు పాకడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఎండలు మండిపోవడంతో ప్రజలే కాకుండా దేవుడు కూడా ఇబ్బంది పడుతున్నాడని అర్చకులు చెబుతున్నారు. అందుకే, గణేశుడి విగ్రహానికి చల్లదనం కలిగించేలా చందన పూతలు పూయడమే కాదు, గర్భగుడిలో వేడిని తగ్గించేందుకు రెండు ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేశారు.
అయితే, ఈ ఘటనపై సైన్స్ నిపుణులు భిన్నంగా చెబుతున్నారు. పగడపు రాయితో తయారైన విగ్రహాలు ఎప్పుడూ వేడిగా ఉంటాయని, వాతావరణంలో మరింత వేడి నెలకొన్నప్పుడు ఆ విగ్రహాల నుంచి తడి రావడం సాధారణం అని వివరించారు.