Haryana: అత్తను చిత్ర హింసలు పెడుతున్న కోడలు.. ట్విట్టర్ ద్వారా విషయం తెలుసుకుని ముఖ్యమంత్రి ఫైర్!
- కోడలి కర్కశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
- ఇలాంటివి సహించేది లేదు
- ఆసుపత్రికి బాధితురాలి తరలింపు
ఆ వృద్ధురాలు ఆర్మీలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగి భార్య. నెలకు రూ.30 వేలు పెన్షన్ పొందుతోంది. అయితే ఆమె పెన్షన్ తీసుకుంటున్న కోడలు, వృద్ధాప్యంలో అత్తకు తోడుగా ఉండాల్సింది పోయి చిత్ర హింసలు పెడుతోంది. ప్రతి రోజూ ఆ వృద్ధురాలి పట్ల కోడలు చూపిస్తున్న కర్కశాన్ని సహించలేని పక్కింటి వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్లో సీఎంకు ట్యాగ్ చేశాడు.
హరియాణాలోని మహేంద్రనగర్ జిల్లాలోని నివాజ్ గ్రామ పరిధిలో జరిగిన ఈ సంఘటనను ట్విట్టర్లో చూసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వృద్ధురాలిపై దాడికి పాల్పడిన ఆమె కోడలును వెంటనే అరెస్ట్ చేయించినట్టు ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, నాగరిక సమాజంలో ఇలాంటి చర్యలను సహించేది లేదంటూ ట్విట్టర్ వేదికగా ఖట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత పోలీసు అధికారి మాట్లాడుతూ, ప్రస్తుతం బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, కోలుకున్న అనంతరం ఆమె కోరుకున్న చోటుకు పంపిస్తామని తెలిపారు.