Donald Trump: తనలోని స్పేస్ పరిజ్ఞానాన్ని చూపిన ట్రంప్... నెటిజన్ల ఎద్దేవా!
- అంగారకుడిలో చంద్రుడు భాగమట
- మరింత పెద్ద లక్ష్యాలను సాధించాలి
- జోకులు, వెటకారాలతో ఆడుకుంటున్న నెటిజన్లు
తరచూ ఏదో ఒకటి మాట్లాడి, నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరోసారి అదే పని చేశారు. చంద్రుడు కూడా అంగారకుడిలో భాగమేనంటూ ఆయన చేసిన ఓ ట్వీట్ పై ఇప్పు ట్రోలింగ్ మొదలైంది. తాజాగా, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ టార్గెట్ గా ఆయన ట్వీట్ చేశారు. "అంతరిక్ష పరిశోధనలకు కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాం. ఆ డబ్బునంతా చంద్రుడిపై మాత్రమే పరిశోధనలకు నాసా ఎందుకు ఖర్చు చేస్తోంది?. 50 ఏళ్ల క్రితమే మనం చంద్రుడిపై కాలు పెట్టాం. రక్షణ, సైన్స్ రంగాల్లో ఇంకా పెద్ద లక్ష్యాలను సాధించాలి. అంగారకుడిపై అధ్యయనం చేయాలి (చంద్రుడు కూడా అంగారకుడిలో భాగమే కదా)" అని ట్రంప్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ వైరల్ కాగా, జోకులు, వెటకారాలు, వెక్కిరింపులు, మెమెలతో నెటిజన్లు ఆడుకుంటున్నారు. చంద్రుడు భూమికి ఉపగ్రహమని గుర్తు చేస్తున్నారు. ఈ విషయం ఐదో తరగతి చదువుతున్న వారికి కూడా తెలుసునని, 3.39 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న అంగారకుడు చంద్రుడిలో భాగం ఏంటని, అగ్ర రాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం జ్ఞానం ఉండద్దా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇక మరికొందరైతే, ట్రంప్ తండ్రి ఖగోళ శాస్త్రం గురించి ఎన్నడూ చెప్పలేదని, అంగారకుడిలో చంద్రుడిని భాగం చేసి కొత్త రహస్యాన్ని ట్రంప్ బట్టబయలు చేశారని అంటున్నారు. ఇకపై నాసా ట్రంప్ సహాయ సహకారాలు ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందని చలోక్తులు విసురుతున్నారు.