Jagan: ఏపీ మంత్రులవుతారనుకుంటే... పదవులు ఆశించి భంగపడ్డ నేతలు!
- జాబితాలో రోజా, భూమన, చెవిరెడ్డి, కొరుముట్ల
- శిల్పా మోహన్ రెడ్డి అంబటి రాంబాబులకూ నిరాశే
- ఫైర్ బ్రాండ్ లుగా ముద్రపడ్డ వారిని పక్కనబెట్టిన జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తనదైన ముద్రను చూపుతూ పూర్తి సామాజిక న్యాయం పాటిస్తూ, మంత్రివర్గాన్ని ఎంచుకోగా, తమకు కచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని భావించిన కొందరికి నిరాశే మిగిలింది. వీరిలో మాజీ మంత్రులు, పార్టీలో ఫైర్ బ్రాండ్ లుగా ముద్రపడ్డవారు, జగన్ కు అత్యంత సన్నిహితులని పేరు తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గురించే. ఆమెకు మంత్రి పదవి ఖాయమని, కీలక శాఖ దక్కుతుందని ఎంతో ప్రచారం జరిగింది. కానీ, ఆమెను జగన్ తీసుకోలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆపై జగన్ కు ఎంతో నమ్మకస్తులుగా ముద్రపడ్డ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలకూ మంత్రి పదవులు లభించలేదు.
అయితే, కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి, చెవిరెడ్డికి విప్ పదవి, తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి, కొరుముట్ల శ్రీనివాసులుకి విప్ పదవి లభించాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి మాజీ స్పీకర్ కోడెలపై విజయం సాధించిన అంబటి రాంబాబుకు కూడా నిరాశే మిగిలింది. కర్నూలు జిల్లా నుంచి శిల్పా కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగినా, అది వాస్తవ రూపం దాల్చలేదు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మంగళగిరి ఎమ్మెల్యే-ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు పదవులు ఖాయమని భావించినా, జగన్ వారిని తన క్యాబినెట్ లోకి తీసుకోలేదు.