Madhya Pradesh: ఉజ్జయినిలో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య
- బాలికను చంపి నదిలో పడేసిన నిందితులు
- కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు
- బాలిక అంకుల్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మధ్యప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉజ్జయినిలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేశారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్టు ఉజ్జయిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సచిన్ అతుల్కర్ తెలిపారు.
శుక్రవారం చిన్నారి అదృశ్యం కాగా, అదే రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని బాలిక కోసం గాలిస్తున్న పోలీసులు సాయంత్రం షిప్రా నదిలో తేలియాడుతున్న బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి శరీరంపై ఉన్న గాయాలను బట్టి ఆమెపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శనివారం నాటి వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్టు తేలింది.
ఈ కేసులో బాలిక అంకుల్ సహా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాలికపై అత్యాచారం, హత్య ఘటనతో మధ్యప్రదేశ్ వేడెక్కింది. ప్రతిపక్షాలు ఈ ఘటనను ఆయుధంగా చేసుకుని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నిస్తున్నాయి. నేరస్తుల విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతోందని బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ భార్గవ్ విమర్శించారు. అధికారులను బదిలీ చేయడం వల్ల ఒనగూరేది ఏమీ లేదని, దీనివల్ల నేరగాళ్లను ప్రోత్సహించినట్టు అవుతుందని పేర్కొన్నారు.