Kodela: కోడెల కుమార్తె డాక్టర్ విజయలక్ష్మిపై కేసు!
- నరసరావుపేటలో భూ కబ్జాకు ప్రయత్నం
- రూ. 15 లక్షలు వసూలు చేసిన విజయలక్ష్మి!
- పోలీసులకు బాధితుల ఫిర్యాదు
వేరొకరి భూమిని ఆక్రమించే ప్రయత్నం చేయడంతో పాటు భూ యజమానులను బెదిరించారన్న ఆరోపణలపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మితో పాటు ఆమె అనుచరులపై నరసరావుపేట పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం, 2002లో పూదోట మారయ్య అనే వ్యక్తి నుంచి నరసరావుపేటకు చెందిన అర్వపల్లి పద్మావతి అనే మహిళ కేసానుపల్లి వద్ద ఎకరం భూమిని కొనుగోలు చేసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయలక్ష్మి కన్ను ఈ భూమిపై పడింది. నకిలీ పత్రాలను సృష్టించి, భూమి వద్దకు వెళ్లిన విజయలక్ష్మి అనుచరులు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, కళ్యాణం రాంబాబులు పద్మావతిని బెదిరించారు. ఈ భూమి తమదేనని, మరోమారు ఇక్కడికి వస్తే హత్య చేస్తామని హెచ్చరించారు. కావాలంటే విజయలక్ష్మి వద్దకు వెళ్లి సెటిల్ చేసుకోవాలని సూచించారు. దీంతో బాధితురాలు విజయలక్ష్మి వద్దకు వెళ్లగా, ఆమె రూ. 20 లక్షలు డిమాండ్ చేశారు. తమకు మరోదారి లేదని భావించిన పద్మావతి, రూ. 15 లక్షలను విడతలవారీగా చెల్లిస్తానని చెప్పి ఆ డబ్బు ఇచ్చింది.
ఈ భూమిలో సుబాబుల్ తోటను పెంచుకున్న పద్మావతి, గత జనవరిలో దాన్ని నరికించేందుకు వెళ్లగా, మరోమారు వచ్చిన రాంబాబు, శ్రీనివాసరావులు, మిగతా రూ. 5 లక్షలు ఇచ్చిన తరువాతే అడుగు పెట్టాలని హెచ్చరించారు. గతవారం మరోమారు బాధితురాలు పొలం వద్దకు వెళ్లగా, ఆమెపై దాడి చేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పద్మావతి ఫిర్యాదు మేరకు కేసును రిజిస్టర్ చేసుకున్న పోలీసులు, దర్యాఫ్తు చేపట్టామని వెల్లడించారు.