kerala: యూపీని చూసినట్టుగా కేరళను ప్రధాని చూడరు!: రాహుల్ గాంధీ
- కోజికోడ్ లో పర్యటించిన రాహుల్ గాంధీ
- కేరళ ప్రయోజనాల విషయంలో మోదీ స్పందన కష్టమే
- బీజేపీ పాలనలేని రాష్ట్రాలపై మోదీ ఆలోచనలు నాకు తెలుసు
యూపీని చూసినట్టుగా కేరళను ప్రధాని మోదీ చూడరని తనకు తెలుసని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కేరళలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కోజికోడ్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, కేరళ ప్రయోజనాల విషయంలో మోదీ తగిన విధంగా స్పందిస్తారని తాను ఆశించడం లేదని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీ యేతర పాలిత రాష్ట్రాల మధ్య ప్రధాని ఆలోచనలు ఎలా ఉంటాయో తనకు అనుభవపూర్వకంగా తెలుసని వ్యాఖ్యానించారు. కేరళ తనకు వారణాసితో సమానమని మోదీ మాటలు చెబుతారే తప్ప ఆచరణలో మాత్రం కనబడదని అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పాటించని వారిని భారతీయులుగా మోదీ పరిగణించరని తీవ్ర విమర్శలు చేశారు. కేరళను నాగపూర్ నుంచి, ప్రధాని కార్యాలయం నుంచి పాలించేలా చేయబోమని రాహుల్ పేర్కొన్నారు. కేరళ ప్రజల గొంతుకను లోక్ సభలో వీలైనంత ఎక్కువగా వినిపించే ప్రయత్నం చేస్తానని రాహుల్ పేర్కొన్నారు.