PIA: విమానంలో మహిళ చేసిన పనికి బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
- టాయిలెట్ అనుకుని ఎమర్జెన్సీ డోర్ తెరిచిన వైనం
- ఒక్కసారిగా తెరుచుకున్న ఎయిర్ బ్యాగులు
- విమానాన్ని నిలిపివేసిన సిబ్బంది
కొత్తగా విమాన ప్రయాణాలు చేసేవారు తెలిసిన వారి సాయం తీసుకోవడం చాలా ఉత్తమం. లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ సిటీ నుంచి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వస్తున్న విమానంలో ఓ మహిళ చేసిన పని తీవ్ర ఆందోళన కలిగించింది. పాకిస్థాన్ ఇంటర్నేషన్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కు చెందిన విమానం టేకాఫ్ తీసుకోవడానికి రన్ వేపై వేగం అందుకుంటుండగా ఓ మహిళ తన సీట్లోంచి హడావుడిగా లేచింది. నేరుగా వెళ్లి ఎమర్జెన్సీ డోర్ తీసింది.
టేకాఫ్ తీసుకుంటున్న విమానం తలుపు తెరుచుకోవడంతో వార్నింగ్ అలారం మోగింది. ముందుజాగ్రత్తగా ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నాయి. ఇక విమానంలో ఉన్న ఇతర ప్రయాణికుల సంగతి చెప్పనక్కర్లేదు. భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో అర్థంకాక హడలిపోయారు. దాంతో విమానాన్ని సిబ్బంది నిలిపివేసి ప్రయాణికులను ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి పంపారు. ఇక, ఆ మహిళను ప్రశ్నించగా, తాను టాయిలెట్ కు వెళ్లాలనుకుని డోర్ తెరిచానని, అది ఎమర్జెన్సీ డోర్ అనుకోలేదని తెలిపింది. ఏదైతేనేమి, ఆ మహిళ చేసిన పనికి పీఐఏ విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది.