Pawan Kalyan: మార్పు ఎందుకు రాదో, జనసేన ప్రభుత్వం ఎందుకు స్థాపించలేమో చూస్తా: పవన్ కల్యాణ్
- పార్టీ నేతలను ఉద్దేశించి పవన్ ప్రసంగం
- రాజకీయాల్లోకి వచ్చింది పారిపోవడానికి కాదు
- ఇంతమాత్రం కసి, పౌరుషం లేకపోతే రాజకీయాల్లోకి ఎందుకు వస్తాం?
జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీపరమైన సమీక్షలతో బిజీగా ఉన్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయా జిల్లాల నేతలతో సమీక్షలు ముగించిన అనంతరం ఆయన తీవ్ర భావోద్వేగాలతో ప్రసంగించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది పారిపోవడానికి కాదని, నిలబడి రాజకీయాలు చేయడానికి అని స్పష్టం చేశారు. రాజకీయాలంటే ఎంతో ఇష్టంతో వచ్చానని అన్నారు.
"2014లోనే చెప్పాను. నేనొచ్చింది పాతికేళ్లు దృష్టిలో పెట్టుకుని అని. 2019 తర్వాత జనసేన పార్టీకి నాయకులు వచ్చారు. ఇప్పటిదాకా ప్రజల మధ్యన తిరిగింది జనసైనికులే. ఇకమీదట నాయకులు కూడా ప్రజల కోసం రోడ్లపైకి వస్తే పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. చాలామంది నన్నడిగారు.. ఎంతకాలం పార్టీని నడుపుతారని! మీలోంచి నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లేంత వరకు నడుపుతానని చెప్పాను. నేను ఎలాంటివాడ్నంటే అందరూ వెళ్లిపోయినా పార్టీ ఆఫీసులో నేనొక్కడ్నే కూర్చుంటా. అందరూ వచ్చేవరకు ఇక్కడే కూర్చుంటా. మార్పు ఎందుకు రాదో చూస్తా. మన జనసేన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు స్థాపించలేమో చూస్తా. ఇంతమాత్రం కసి, ఇంతమాత్రం పౌరుషం లేకపోతే ఎందుకు వస్తాం రాజకీయాల్లోకి, పారిపోవడానికా రాజకీయాల్లోకి వచ్చేది!" అంటూ ఆవేశంతో ఊగిపోయారు.