Team India: ప్రపంచకప్: ఆసీస్‌ను మట్టికరిపించిన భారత్

  • ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా రెండో విజయం
  • బ్రహ్మాండంగా రాణించిన భారత టాపార్డర్
  • ‘ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా సెంచరీ వీరుడు ధవన్‌

ప్రపంచకప్‌లో భారత్ విజయాల వేట మొదలైంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు చేసింది.

టీమిండియా టాపార్డర్ అద్భుతంగా రాణించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 57 పరుగులు చేయగా, తొలి మ్యాచ్‌లో విఫలమైన శిఖర్ ధవన్  ఈసారి రెచ్చిపోయాడు. 109 బంతుల్లో 16 ఫోర్లతో 117 పరుగులు చేసి తన ఖాతాలో మరో సెంచరీ వేసుకున్నాడు. కెప్టెన్ కోహ్లీ 82 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో రెచ్చిపోయి ఆడాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోని కంటే ముందొచ్చిన పాండ్యా ధనాధన్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. ధోనీ కూడా క్రీజులో ఉన్నంతసేపూ బ్యాట్ ఝళిపించాడు. 14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 27 పరుగులు చేశాడు. లోకేశ్ రాహుల్ 11 పరుగులు చేశాడు. దీంతో భారత్ 352 పరుగుల భారీ స్కోరు సాధించి ఆసీస్ ఎదుట కొండంత విజయ లక్ష్యాన్ని ఉంచింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 316 పరుగులకే ఆలౌటై ప్రపంచకప్‌లో తొలి ఓటమిని నమోదు చేసింది. డేవిడ్ వార్నర్ (56), అరోన్ ఫించ్ (36), స్టీవెన్ స్మిత్ (69), ఉస్మాన్ ఖావాజా (42), అలెక్స్ కేరీ (55)లు క్రీజులో ఉన్నంత సేపు భారత్‌ను భయపెట్టారు. ఒకానొక దశలో విజయం దిశగా దూసుకుపోతున్నట్టు కనిపించారు.

అయితే, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలు చెరో మూడు వికెట్లు తీసి కంగారూలకు కళ్లెం వేశారు. చాహల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. సెంచరీతో భారత విజయానికి బాటలు వేసిన శిఖర్ ధవన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా, భారత్ తన తర్వాతి మ్యాచ్‌ను ఈ నెల 13న న్యూజిలాండ్‌తో ఆడనుంది.

  • Loading...

More Telugu News