Assam: దుస్తులు విప్పి డ్యాన్స్ చేయాలంటూ మహిళా డ్యాన్సర్లపై ఒత్తిడి.. తప్పించుకుంటే రాళ్లతో దాడి!
- మహిళలపై ఒత్తిడి తెచ్చిన 500 మంది పురుష గ్యాంగ్
- అసోంలోని కామ్రూప్ జిల్లాలో ఘటన
- స్ట్రిప్ డ్యాన్స్ పేరుతో భారీగా టికెట్లు అమ్ముకున్న నిర్వాహకులు
ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను దుస్తులు విప్పి డ్యాన్స్ చేయాలంటూ 500 మందితో కూడిన ఓ పురుషుల గ్యాంగ్ తీవ్ర ఒత్తిడి చేసింది. అసోంలోని కామ్రూప్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఈ ఘటనతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దుస్తులు విప్పి డ్యాన్స్ చేయాలంటూ తమపై ఒత్తిడి తీసుకొచ్చారంటూ సాంస్కృతిక బృందం సభ్యులు నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఏదోరకంగా తప్పించుకుని బయటపడ్డామని అయితే, తాము వెళ్తుంటే తమ వాహనాలపై రాళ్లతో దాడిచేశారని వాపోయారు.
పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్ నుంచి వస్తున్న డ్యాన్స్ బృందం స్ట్రిప్ డ్యాన్స్ (దుస్తులు ఒక్కొక్కటిగా తీసివేస్తూ చేసే నృత్యం) చేస్తుందని ప్రచారం చేసిన నిర్వాహకులు టికెట్లను భారీ ఎత్తున అత్యధిక ధరకు అమ్ముకున్నట్టు పోలీసులు తెలిపారు. అందుకనే మహిళలను దుస్తులు విప్పి డ్యాన్స్ చేయాల్సిందిగా బలవంతం చేశారని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.