ICC World cup: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ట్యాంపరింగ్ కలకలం!
- పదేపదే జేబులో చేతులు పెట్టుకున్న జంపా
- ఆపై బంతిని రుద్దడంతో అనుమానాలు
- ఐసీసీ దృష్టి సారించాలంటున్న నెటిజన్లు
ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ జరిగిందా? ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా ప్రవర్తన చూసిన వారు అవుననే అంటున్నారు. జంపా తన ప్రవర్తనతో అభిమానుల్లో అనుమానాలు రేకెత్తించాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో పదేపదే జేబులో చేతులు పెట్టుకుని తడమడం, ఆపై బంతిని రుద్దుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జంపా కచ్చితంగా బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఉంటాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, ప్రతిసారి జేబులో చేతులు పెట్టుకుని ఆపై బయటకు తీసి బంతిని రుద్దాడని, ఈ వీడియోపై ఐసీసీ దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, గతేడాది కూడా ఆసీస్ బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్ ప్రపంచం ముందు అభాసుపాలైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో బంతిని ట్యాంపరింగ్ చేసిన ఆసీస్ ఆటగాళ్లు బెన్‌క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్‌పై ఐసీసీ నిషేధం కూడా విధించింది. నిషేధం పూర్తవడంతో ఈ ప్రపంచకప్‌లో వార్నర్, స్మిత్‌లకు అవకాశం దక్కింది. ఇప్పుడు జంపా ప్రవర్తన మరోమారు అనుమానాలకు తావిస్తోంది.